ఒక్కరోజే పూజలందుకునే క్షేత్రం

భగవంతుడు సర్వాంతర్యామి ... ఆయనలేని చోటులేదు ... ఆయన అనుగ్రహంలేని జీవిలేదు. భగవంతుడు అంతటా వుంటే పుణ్యక్షేత్రాలకి పరుగులు తీయడం ఎందుకని చాలామంది అనుకుంటూ వుంటారు. భగవంతుడు ఆవిర్భవించిన కారణంగా ... ఆయన దర్శనార్థం ఎందరో మహర్షులు ... యోగులు రావడం వలన ఆ క్షేత్రాలు మరింత పవిత్రమవుతుంటాయి.

అలా ఆవిర్భవించిన క్షేత్రాలు నిత్య పూజలతో ... ఉత్సవాలతో ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ వుంటాయి. అయితే అరణ్య ప్రాంతాల్లో వెలసిన కొన్ని క్షేత్రాలను మాత్రం ఒక నిర్దిష్టమైన కాలంలోనే దర్శించుకోవలసి వుంటుంది. అలాంటి క్షేత్రాలకు మరింత భిన్నంగా ఒక్కటంటే ఒక్కరోజే భక్తుల పూజలందుకునే క్షేత్రం లేకపోలేదు. ఆశ్చర్యాన్ని కలిగించే అపూర్వమైన ఆ క్షేత్రం, నల్లమల అడవుల్లో దర్శనమిస్తుంది.

వీరభద్రస్వామి ... భద్రకాళీ సమేతంగా దర్శనమిచ్చే ఈ ఆలయం పాలంక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎంతోమంది రాజులు ... మహామంత్రులు ... సంస్థానాధీశులు దర్శించుకున్న ఈ క్షేత్రంలో, ప్రతి ఏడాది 'తొలి ఏకాదశి' రోజున మాత్రమే పూజలు జరుగుతుంటాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడి స్వామిని సేవించడం వలన విజయం ... సంతానం ... సంపద కలుగుతాయని అనుభవపూర్వకంగా చెబుతూ వుంటారు.


More Bhakti News