శ్రీ రంగనాయక స్వామి క్షేత్రం

శ్రీమహావిష్ణువు అనేక ప్రదేశాల్లో శయనముద్రలో కొలువుదీరి రంగనాయకస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. అలా స్వామి దర్శనమిచ్చే క్షేత్రాలలో ఒకటిగా కృష్ణా జిల్లా 'తిరువూరు' కనిపిస్తూ వుంటుంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు రంగనాయకస్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేంకటేశ్వరుడుకి వైఖానస ఆగమం ప్రకారం ... రంగనాయకులకి పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు జరుగుతుంటాయి.

బస్టాండుకి దగ్గరలో కనిపించే రంగనాయకస్వామి ఆలయం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. సువిశాలమైన ఇక్కడి ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక భావాలు వికసిస్తుంటాయి. గర్భాలయంలో స్వామివారు శయనముద్రలో కనిపిస్తుంటాడు. స్వామివారికి సేవ చేస్తూ ఆయన పాదాల చెంత లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.

ఇక గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో 'గోదాదేవి' దర్శనమిస్తుంది. ఈ కారణంగా ఇక్కడ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ మాసమంతా కూడా తెల్లవారు జామునే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పాశురాలు విని తరిస్తారు. ఈ సందర్భంలో జరిగే స్వామివారి కల్యాణోత్సవం చూసితీరవలసిందే. ఈ కళ్యాణ అక్షింతలను తలపై ధరించిన వారికి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు.

ఇదే ప్రాంగణంలో చాలా పెద్దదైన పాముపుట్ట కనిపిస్తుంది. నాగులచవితి ... నాగ పంచమి వంటి పర్వదినాల్లో ఇక్కడి నాగేంద్రస్వామికి భక్తులు పాలు ... పండ్లు సమర్పిస్తుంటారు. ఈ రోజుల్లో స్వామివారిని సేవించడం వలన సంతానం కలుగుతుందనీ ... సౌభాగ్యం నిలుస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News