సాయిశ్వర క్షేత్రం

కైలాసమనేది పేరుకే గానీ ... నిత్యం శివుడు నివాసముండేది భక్తుల సన్నిధిలోనే. భక్తులను కరుణించడం ... కోరిన వరాలను ప్రసాదించడమనే పనిని ఆయన ఎంతో ఇష్టంగా చేస్తుంటాడు. ఈ కారణంగానే అశేష భక్త జనకోటి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శిస్తూ పునీతులవుతున్నారు.

ఈ నేపథ్యంలో శివ స్వరూపుడిగా శిరిడీ సాయిబాబా కూడా విశేషమైన రీతిలో పూజలు అందుకుంటూ వస్తున్నాడు. తన భక్తుల బాధలను తాను స్వీకరించి ... వాళ్లకి ఆనందాన్ని అందించే శిరిడీసాయికి అనూహ్యమైన స్థాయిలో ఆదరణ పెరుగుతూ వస్తోంది. అందుకు నిదర్శనంగా అనేక ప్రాంతాల్లో ఆయన ఆలయాలు అలరారుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ప్రాచీన శివాలయాల చెంతనే శిరిడీసాయి ప్రతిమలను నెలకొల్పుతున్నారు. అలాంటి క్షేత్రం మనకి హైదరాబాద్ - గుడిమల్కాపూర్ లో దర్శనమిస్తుంది.

ఇక్కడ ప్రాచీనకాలంనాటి శివాలయం ఆనాటి భక్తి శ్రద్ధలకు ఆనవాలుగా కనిపిస్తూ వుంటుంది. ఆ తరువాత కాలంలో నిర్మించబడిన సాయిబాబా ఆలయం ప్రశాంతతను ప్రతిబింబిస్తూ వుంటుంది. శివాలయంలో 'ఉమాశంకరులు' భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటారు. ఇక మహా మంటపంలో రాజదర్బార్ ను తలపించేటటు వంటి వేదికపై నుంచి సాయి కరుణామృతాన్ని కురిపిస్తుంటాడు.

శిరిడీలో మాదిరిగానే ఇక్కడ బాబాకి అన్నిరకాల సేవలు జరుగుతూ వుంటాయి. ప్రతి గురువారం ... ప్రతి సోమవారం రోజున భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక కార్తీక మాసంలో ఇక్కడి శివయ్యని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు హరించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు ... సాయిశ్వరుడి కృపకు పాత్రులవుతుంటారు.


More Bhakti News