కోరిన వరాల నిచ్చే కోట మైసమ్మ

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు గ్రామదేవతగా అనేక నామాలతో ... వివిధ రూపాలలో ఆవిర్భవిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోను ఓ గ్రామదేవత కొలువుదీరి కనిపిస్తూ వుంటుంది. గ్రామస్తులంతా తమ యోగ క్షేమాలకి సంబంధించిన బాధ్యతను అమ్మవారి పైనే వేస్తారు. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలే తమని అనుక్షణం కాపాడుతూ ఉంటాయని వాళ్లు అనంతమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

అలా గ్రామస్తులచే నిత్యపూజలందుకుంటోన్న 'కోటమైసమ్మ' క్షేత్రం మనకి నల్గొండ జిల్లా కుక్కడం సమీపంలోని 'ఇండ్ల కోటయ్యగూడెం'లో కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన కోట మైసమ్మకి గల మహిమ గురించి చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా బాగా తెలుసు. అందువలన ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు.

ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించడం గురించి ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది. అలాగే అమ్మవారి మహిమలను గురించి కూడా భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ప్రతి గురువారం ... ఆదివారం రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది. అమ్మవారు ఒకరి వంటిమీదకి రావడం ... భక్తులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలివ్వడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ఈ సమాధానాల కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది.

ప్రతివారం ఈ ప్రాంతం ఒక జాతరను తలపిస్తూ వుంటుంది. ఈ అమ్మవారి చల్లనిచూపు కారణంగానే పంటలు బాగా పండుతాయనీ, సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఇక పండుగలకు .. పర్వదినాలకు పుట్టినింటికి వచ్చిన ఆడపిల్లలు ఈ తల్లిని దర్శించుకోకుండా తిరిగి అత్తవారింటికి వెళ్లరు. ప్రేమానురాగాలతో ఆ తల్లికి నూతన వస్త్రాలు .. గాజులు .. పసుపు కుంకుమలు .. నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కోటమైసమ్మ తల్లి ఈ ఆలయంలోనే కాదు ప్రతి ఒక్కరి హృదయమనే కోటలోను కనిపిస్తూ వుంటుంది .. కరుణిస్తూ వుంటుంది.


More Bhakti News