అహోబిలం

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో 'అహోబిల క్షేత్రం' అలరారుతోంది. ఇక్కడి శాసన ఆధారాలను బట్టి ఈ క్షేత్రం దిగువ అహోబిలం ... ఎగువ అహోబిలంగా విభజించబడినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికి మధ్య 13 కిలోమీటర్ల దూరం వుంటుంది. హిరణ్య కశిపుడిని వధించిన అనంతరం నరసింహస్వామి ఉగ్రరూపంలో ఈ కొండ ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు దేవతలంతా 'అహోబలం' అంటూ ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించడం వలన, అదే ఈ ప్రదేశానికి పేరుగా మారింది. స్వామి బిలంలో వేంచేసి ఉన్నందువలన కాలక్రమంలో ఆ పేరు 'అహోబిలం'గా మారింది.

నవనారసింహ క్షేత్రాలలో 'అహోబిలం' మొదటిదని చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో అహోబిల నరసింహుడు ... జ్వాలా నరసింహుడు .. మాలోల నరసింహుడు .. వరాహ నరసింహుడు .. కారంజా నరసింహుడు .. భార్గవ నరసింహుడు .. యోగానంద నరసింహుడు .. ఛత్రవట నరసింహుడు .. పావన నరసింహుడు .. రూపాలు కొలువుదీరిన కారణంగా ఇది నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది.

108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిల క్షేత్రాన్ని, త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణకి బయలుదేరడానికి ముందు ... ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలోను ... కలియుగంలో వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలోను దర్శించుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఇక ఆది శంకరాచార్యులు ... రామానుజా చార్యులు ... మధ్వా చార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారు.

అనేక పవిత్ర తీర్థాల కలయిక కారణంగా ఇక్కడ ఏర్పడిన 'భవనాశిని తీర్థం' మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. కాకతీయ రాజులు .. రెడ్డిరాజులు .. విజయనగర రాజులు .. అహోబిలం క్షేత్ర అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. ఈ కారణంగానే అహోబిలం క్షేత్రం నేడు ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతోంది.

ఇక్కడి విశాలమైన ఆలయ ప్రాంగణం ... మనసుదోచే మంటపాలు ... ఎత్తైన గోపురాలు ... గర్భాలయ విమానాలు ... పొడవైన ప్రాకారాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఆధ్యాత్మిక .. చారిత్రక .. శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే అహోబిల క్షేత్రాన్ని దర్శించుకుంటే మనసు మంత్ర ముగ్ధమవుతుంది ... జన్మ చరితార్థమవుతుంది.


More Bhakti News