దైవసన్నిధానం

హరిహరులు వేరు వేరుగా కనిపించే క్షేత్రాలు ... ఇద్దరూ కొలువుదీరిన క్షేత్రాలు ... వారి పరివారాలు పూజలందుకునే క్షేత్రాలు మనకి అక్కడక్కడా కనిపిస్తూ వుంటాయి. ఇక ఈ దేవతలందరూ ఒక్క చోటునే కనిపించే క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటూ వుంటాయి. ప్రాచీన క్షేత్రాలను పక్కన పెడితే, ఇన్ని ఆలయాలు గల క్షేత్రాన్ని నగరవాసులకు అందుబాటులో నిర్మించడం మరింత కష్టసాధ్యమని చెప్పాలి.

అందరి కృషితో అది సాధ్యమని నిరూపిస్తూ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని 'దైవసన్నిధానం' ఇక్కడి గుట్టలాంటి ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు కళ్ళను కట్టిపడేస్తుంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు దర్శనమిస్తూ వుంటాడు.

వేంకటేశ్వరస్వామి గర్భాలయానికి ఓ వైపున శివుడు ... మరో వైపున శ్రీ రాజరాజరాజేశ్వరి దేవి అమ్మవారు ప్రత్యేక మందిరాలలో కొలువై వుంటారు. ఇక ఆ పక్కనే గణపతి మందిరం ... హరిహరుల మందిరం కూడా దర్శనమిస్తుంటాయి. నిలువెత్తు రూపంగా అత్యంత సుందరంగా మలచబడిన హరిహరుల విగ్రహం, అలంకరణ వలన మరింతగా మనసు దోచుకుంటూ వుంటుంది.

ఇక్కడి మెట్ల ద్వారా మరికాస్త పైకి వెళితే, కుమారస్వామి మందిరం ... అయ్యప్ప మందిరం ... శ్రీ సత్యనారాయణస్వామి మందిరం దర్శనమిస్తాయి. ఇక ఇక్కడి హనుమంతుడుని చూస్తే నిజంగానే ఆయన మన ముందు నుంచున్నాడేమోనని అనిపించక మానదు. అంత ఎత్తులో ఆయన విగ్రహం కొలువైవుంటుంది. ప్రశాంతతకు ... పరిశుభ్రతకు ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది.

గర్భాలయాల్లో కొలువుదీరిన ప్రతి మూలమూర్తిలోను జీవకళ ... సౌందర్యం ఉట్టిపడుతూ వుండటం ఇక్కడి విశేషం. ఇక్కడ చిత్రపరిశ్రమకి సంబంధించిన వారు ఎక్కువగా వుంటారు గనుక, వారి రాకపోకలతో ఈ ఆలయం నిత్యం రద్దీగానే కనిపిస్తూ వుంటుంది. పర్వదినాలలో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుపుతుంటారు. యాగశాలతో సహా అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి దైవ సన్నిధానంలోకి అడుగుపెట్టిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News