అపురూప గణపతి

ప్రాచీనకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటోన్న ఘనత గణపతి సొంతం. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవలసిందే ... ఆశీర్వాదం పొందవలసినదే. సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ వుంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లనే అంతా ఆయన చుట్టూ చేరుతుంటారు. పిల్లల మొదలు పెద్దల వరకూ అంతా ఆయనని ఇష్టపడుతుంటారు.

తరతరాలుగా తరగని ఆదరణను పొందుతోన్న గణపతి అనేక ప్రాంతాల్లో వివిధ రూపాలతో దర్శనమిస్తూ వుంటాడు. అనంతమైన ఆయన రూపాల్లో 12 ప్రధానమైనవని ... 21 విశిష్టమైనవని ... 32 ముఖ్యమైనవని ... 54 వున్నతమైనవని 108 మహొన్నతమైనవని అంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల సంఖ్యను ... ఏకాదశ రుద్రుల సంఖ్యను కలుపుకుని 21 గణపతి రూపాలు విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ గణపతి రూపాల జాబితాలో వినాయకుడు .. బీజ గణపతి .. హేరంభ గణపతి .. వక్రతుండ గణపతి .. బాలగణపతి .. తరుణ గణపతి .. భక్తి గణపతి .. వీర గణపతి .. శక్తి గణపతి .. ధ్వజ గణపతి .. పింగళ గణపతి .. ఉచ్చిష్ట గణపతి .. విఘ్నరాజ గణపతి .. లక్ష్మీ గణపతి .. మహా గణపతి .. భువనేశ గణపతి .. నృత్త గణపతి .. ఊర్ధ్వ గణపతి .. ప్రసన్న గణపతి .. ఉన్మత్త గణపతి .. హరిద్రా గణపతి దర్శనమిస్తారు.

శిల్ప ... ఆగమ శాస్త్రాలు ఈ గణపతి రూపాలను పేర్కొంటున్నప్పటికీ, గణపతి రూపం ఎలా వున్నా తమకి అపురూపమే అన్నట్టుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తుంటారు ... ఆయన అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.


More Bhakti News