అద్వితీయమైన క్షేత్రం

శ్రీమహా విష్ణువు 'కూర్మావతారం' ధరించిన క్షేత్రాలు ... వేణుగోపాలుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు అక్కడక్కడా దర్శనమిస్తూనే వుంటాయి. అయితే ఆయన కూర్మావతారం ధరించిన వేణుగోపాలుడిగా దర్శనమిచ్చే క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించవు. అలాంటి అరుదైన ... అద్వితీయమైన క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెదకాపవరం' గ్రామంలో దర్శనమిస్తోంది.

స్వామివారు ఇక్కడ ఆవిర్భవించిన విధానం అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడి కలలో శ్రీ వేణుగోపాలస్వామి కనిపించి, కూర్మరూపాన్ని సంతరించుకున్నాడు. తాను ఫలానాచోట నిక్షిప్తమై ఉన్నట్టుగా చెప్పాడు. ఆ ప్రదేశాన్ని కనుక్కోవడానికి అవసరమైన ఆనవాళ్లను కూడా సూచించాడు.

తనకి వచ్చిన కల గురించి ఆ భక్తుడు గ్రామస్తులకు చెప్పాడు. అది సాధారణమైన కలనో ... భగవంతుడి ఆదేశామో తెలియడం లేదని అన్నాడు. కలలో స్వామి చెప్పిన ఆనవాళ్లను బట్టి వెళితే ఆ విషయం నిర్ధారణ అవుతుందని అంతా అనుకున్నారు. గ్రామస్తులంతా కలిసి ఆ ప్రదేశానికి చేరుకొని, అక్కడ ఎత్తుగా వున్న చోట తవ్వారు.

అక్కడే కూర్మావతారంలో గల కృష్ణుడి విగ్రహం బయటపడింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఆ విగ్రహానికి సంప్రోక్షణ చేసి ... ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతూ వస్తున్నాయి. విభిన్నంగా ... స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామిని ఆనాటి సంస్థానాధీశులు ... జమీందారులు ఇలవేల్పుగా భావించి ఆరాధించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి కైంకర్యాలకుగాను ఏర్పాట్లు చేశారు.

అటు వైభవాన్ని ... ఇటు మహిమాన్వితను సంతరించుకున్న ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ వుంటుంది. పర్వదినాల సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన, సంపదలు ... సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News