గోధుమలు విసిరిన కృష్ణుడు

నిరంతరం శ్రీకృష్ణుడి సేవలోను ఆయన నామస్మరణంలోను సక్కుబాయి తరిస్తూవుంటుంది. ఇంటిపని తప్పించుకోవడానికి భక్తి పేరుతో ఆమె నాటకమాడుతోందని అత్తా ... ఆడపడుచు అనుకుంటారు. శ్రీ కృష్ణుడిని ఆరాధించడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెడతారు. శ్రీ కృష్ణుడిని పూజించుకోవడం కోసం వాళ్లు చెప్పిన పనులన్నింటినీ సక్కుబాయి చేస్తూ వుంటుంది. అయినా వాళ్లు ఆమెని ఏదో ఒక విధంగా వేధిస్తూనే ఉండసాగారు.

ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆమె అనారోగ్యానికి లోనవుతుంది. అదంతా నటనేనంటూ వాళ్లు కొట్టిపారేస్తారు. తెల్లవారేలోగా పుట్టెడు గోధుమలు విసరమంటూ సక్కుబాయికి పని పురమాయిస్తారు. లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అవతలపడేస్తామని బెదిరిస్తారు. ఈ విషయంలో తల్లికి అడ్డుచెప్పడానికి విశ్వపతి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. గోధుమల బస్తాలు ఉంచిన గదిలో సక్కుబాయిని వుంచి తలుపులు వేసి వెళ్లిపోతుంది అత్తగారు.

శ్రీ కృష్ణుడిని స్మరిస్తూనే సక్కుబాయి కొంతవరకూ గోధుమలను విసురుతుంది. అలా గోధుమలను విసురుతూనే అలసిపోయిన ఆమె అక్కడే మూర్చపోతుంది. తెల్లవారగానే ఆ తలుపులు తీసిన అత్తా - ఆడపడుచు ఆశ్చర్యపోతారు. గోధుమ బస్తాలన్నీ పిండి విసరబడి వుంటాయి. రాశిగా పోయబడి వున్న పిండిని చూసి వాళ్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు.

వాళ్ల మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సక్కుబాయి, గోధుమల బస్తాలన్నీ పిండి విసిరి వుండటం చూసి ఆశ్చర్యపోతుంది. తాను నమ్ముకున్న కృష్ణుడు తన కష్టం చూడలేక దిగివచ్చాడని సక్కుబాయి అనుకుంటుంది. వెన్నముద్దలను మాత్రమే పట్టుకోవడం తెలిసిన సున్నితమైన చేతులతో, తన కోసం పిండి విసిరిన కృష్ణుడికి ఆమె మనసులోనే కృతజ్ఞతలు తెలియజేస్తుంది.


More Bhakti News