విశిష్ట రామాలయం

చీకటిని వెలుతురు తరిమేసినట్టు ... 'రామ' అనే శబ్దం సమస్త దోషాలను తరిమేస్తుందని శివుడు చెప్పినట్టుగా పురాణాల్లో కనిపిస్తుంది. ఇక 'శివ' అనే రెండు అక్షరాలు అనంతమైన పుణ్యఫలాలను అడగకుండానే ప్రసాదిస్తాయని రాముడు చెప్పాడు. ఈ సంఘటనల కారణంగా శివుడికి ... రాముడికి మధ్యగల అనుబంధం స్పష్టంగా తెలుస్తోంది.

తనకి ఎంతో ప్రీతిపాత్రుడైన రాముడికి సహకారిగా ఉండాలనే ఉద్దేశంతోనే శివుడే ... హనుమంతుడిగా అవతరించాడని కూడా చెబుతుంటారు. అలాంటి రాముడు .. శివుడు .. హనుమంతుడు ఆవిర్భవించిన అరుదైన క్షేత్రం మనకి మెదక్ జిల్లా 'సిద్ధిపేట' గ్రామంలో దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం, ఆనాటి వైభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

గర్భాలయంలో శ్రీరాముడు సీతా సమేతంగా, లక్ష్మణ ... హనుమ సహితంగా కొలువై కనిపిస్తుంటాడు. ఈ ఆలయానికి అతి దగ్గరలోనే హనుమంతుడి ప్రత్యేక ఆలయం దర్శనమిస్తుంది. ఇక ఇదే ప్రాంగణంలో శివుడు ... రామేశ్వరుడుగా, అమ్మవారు 'పర్వతవర్ధిని' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. పూర్వం ఈ ప్రాంతం తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతూ ఉండేదట. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి వచ్చిన ఒక సాధువు సూచనమేరకు రాములవారికి రథోత్సవం జరిపించారు.

ఆ రోజు నుంచి ఈనాటి వరకూ ఈ ప్రాంతం ప్రశాంతంగా ... సుభిక్షంగా వెలుగొందుతోంది. ప్రతియేటా ఇక్కడ 'శ్రీరామనవమి' ... 'శివరాత్రి' ... హనుమజ్జయంతి' ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. తమ సంతోషాలకు ... సంపదలకు కారకుడైన రాములవారిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ... పునీతులవుతుంటారు.


More Bhakti News