ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
- కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి
- గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
అన్ని వర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోదాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖలోని జంతు ప్రదర్శనశాలను ఆధునీకరించి, పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం, పాపికొండలు వంటి ప్రాంతాలు పర్యాటక రంగానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారీ ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని నిర్మించే టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నీతి ఆయోగ్ సమర్పించిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని, ముఖ్యంగా విద్యార్థులు, మేధావుల నుంచి విలువైన అభిప్రాయాలు, ఆలోచనలను స్వీకరించాలని సీఎం కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కిమిడి అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు గల తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో పాటు వీఈఆర్ కన్వీనర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ హరీష్ అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు.