షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు!
- అలీబాగ్‌లో రూ. 24 కోట్లతో బీచ్ ఫ్రంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన యశ్ దంపతులు
- కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి విస్తీర్ణం సుమారు 1.3 ఎకరాలు
- ఈ లావాదేవీ కోసం రూ. 1.44 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లింపు
- ఇప్పటికే అలీబాగ్‌లో షారుఖ్, దీపిక, విరాట్ కోహ్లీలకు ఆస్తులు
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 మే 18న ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయింది. రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ తాలూకాలోని కామత్ గ్రామంలో సుమారు 1.3 ఎకరాల (5,289 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న రెండు వ్యవసాయ భూములను యశ్ దంపతులు కొనుగోలు చేశారు. కిహిమ్ బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ ఆస్తికి పశ్చిమాన సముద్రం, తూర్పున గ్రామ రహదారి ఉన్నాయి.
ఈ ఒప్పందం కోసం యశ్ దంపతులు రూ. 1.44 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 60,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఈ జంట, తమ అటార్నీ ద్వారా ఈ లావాదేవీని పూర్తి చేశారు. నసీమ్ ఇక్బాల్ హలీమ్, ఇఫత్ షఫీక్ అహ్మదీ అనే వ్యక్తుల నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్టు పత్రాల్లో నమోదైంది.
అలీబాగ్ ఇప్పటికే బాలీవుడ్, క్రికెట్ తారలకు వీకెండ్ హోమ్‌గా మారింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్, సుహానా ఖాన్ వంటి ప్రముఖులు ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన యశ్ దంపతులు కూడా చేరడంతో అలీబాగ్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది.