మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం

Vasudeva Reddy Questioned by ED in Liquor Scam Case
  • వైసీపీ హయాంలోని మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి విచారణ
  • హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్
  • లంచాలు, బినామీ ఆస్తులు, మ్యాన్యువల్ ఆర్డర్లపై కీలక వివరాల సేకరణ
  • భార్య, బంధువుల పేరిట రూ.96 కోట్ల ఆస్తుల కొనుగోలుపై ప్రశ్నల వర్షం
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ మద్యం స్కాం కేసులో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని నిన్న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

విచారణ సందర్భంగా, మద్యం సరఫరా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా, B9 బేవరేజెస్ సంస్థకు ఆర్డర్లు ఇవ్వడానికి కేసుపై రూ.65 నుంచి రూ.78 వరకు లంచం తీసుకున్నట్లు ఈడీ సేకరించిన ఆధారాలను ఆయన ముందుపెట్టి నిలదీసినట్లు తెలిసింది. ఈ ముడుపుల సొమ్మును బినామీ సంస్థల ద్వారా ఎలా మళ్లించారనే దానిపై ఆరా తీశారు.

అలాగే, తన భార్య కల్పనారెడ్డి, ఇతర బంధువుల పేర్లతో కొనుగోలు చేసిన సుమారు రూ.96 కోట్ల విలువైన ఆస్తులకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆటోమేటెడ్ విధానాన్ని పక్కనపెట్టి, మద్యం ఆర్డర్లను మ్యాన్యువల్‌గా మార్చడం వెనుక ఉన్న కారణాలు, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై కూడా ప్రశ్నలు సంధించారు. వాసుదేవరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపైనా అధికారులు వివరాలు సేకరించారు. గతంలో ఇదే కేసులో రాష్ట్ర సిట్ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Vasudeva Reddy
Andhra Pradesh Liquor Scam
AP Beverages Corporation
Enforcement Directorate
ED Investigation
B9 Beverages
Liquor Scam
Bribery Case
Kalpana Reddy
YSRCP Government

More Telugu News