Siddaramaiah: బెంగళూరులో మరో విమానాశ్రయం: సిద్ధరామయ్య
- కెంపెగౌడ విమానాశ్రంపై రద్దీ ఒత్తిడి
- బెంగళూరులో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్న సిద్ధరామయ్య
- రూ. 450 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులు చేపడతామన్న సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో బెంగళూరు వాసులకు, పారిశ్రామిక రంగానికి భారీ వరాలు ప్రకటించారు. ప్రధానంగా ఐటీ నగరం బెంగళూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో రెండవ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ నిలుస్తున్న తరుణంలో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కర్ణాటక బడ్జెట్‌లోని కీలక అంశాలు:
విమానయాన రంగం:
కెంపెగౌడ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించేందుకు రెండవ విమానాశ్రయ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించనున్నారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 దేశీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ. 1,593 కోట్లు కేటాయించారు. అలాగే, శివమొగ్గ విమానాశ్రయంలో పీపీపీ పద్ధతిలో విమానాల తయారీ, అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నారు.
మౌలిక సదుపాయాలు:
నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ. 450 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇక సామాజిక విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుగా, విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ను రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో అమలు చేయబోతున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్శిటీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.