Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత

Ambati Rambabu No Longer Deserves Respect Says Home Minister Anita
  • చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అంబటి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • కల్తీ నెయ్యి స్కామ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అనిత
  • అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన పల్లా శ్రీనివాస్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంబటిని హెచ్చరించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

"గతంలో అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ ఇప్పుడు ఆ పదానికి ఆయన అర్హులు కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. పోలీసులను కూడా దారుణంగా దూషించారు. శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించేది లేదు" అని అనిత స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంబటి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ఆమె ఆరోపించారు. "తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో రూ. 250 కోట్ల స్కామ్‌కు పాల్పడిన వైసీపీపై ప్రజలు ఉమ్మి వేస్తున్నారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఈ ప్రయత్నం," అని విమర్శించారు.
చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టడం వల్లే వైఎస్సార్సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, అయినా వారికి బుద్ధి రాలేదని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అనిత పేర్కొన్నారు.

ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ, వ్యక్తిత్వ హననం సరికాదన్నారు. అంబటి వ్యాఖ్యలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. "రాజకీయాల్లో స్థాయిని మరిచి, సంస్కారాన్ని వదిలేసి మాట్లాడటం మీకు అలవాటుగా మారింది... కానీ ఈరోజు మీరు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మా నాయకుడిని దూషించడం అంటే.. కోట్లాది మంది తెలుగు బిడ్డల గౌరవాన్ని కించపరచడమే... నోరు అదుపులో పెట్టుకోండి" అని స్పష్టం చేశారు.
 
Ambati Rambabu
Vangalapudi Anita
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
Palla Srinivasa Rao
Home Minister Andhra Pradesh
Political Criticism
Telugu Desam Party

More Telugu News