Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్‌... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా

Ambati Rambabu Attacked Jagan Assures Support
  • అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్
  • రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ
  • చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపణ
  • పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ సీఎం
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. తనపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని అంబటి ఆరోపిస్తున్న నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ.. రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వై‌సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకుల మాదిరిగా వ్యవహరించడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని ఆయన హెచ్చరించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని అంబటి రాంబాబుకు జగన్ భరోసా ఇచ్చారు.

నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?: జగన్

ఇదే అంశంపై జగన్ సోషల్ మీడియాలోనూ ఘాటుగా స్పందించారు. "చంద్రబాబు గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?" అంటూ మండిపడ్డారు.

"మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్‌రాజ్‌’’గా మారిపోయింది. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబుగారూ, మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం" అని ధ్వజమెత్తారు.

"తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు, పశు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబ్ లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తప్పులను దాచిపెట్టేందుకు దాడులు చేయిస్తున్నారు. ల్యాబ్ ల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించి, మా నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. ఇప్పుడు అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకోవడం మీ నియంత స్వభావానికి నిదర్శనం. ఒక కరడుగట్టిన గూండాగా మీరు తయారయ్యారు" అంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని జగన్ తెలిపారు. దాడులను అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తారని జగన్ వెల్లడించారు. 





Ambati Rambabu
Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
TDP Attack
Tirumala Laddu
Chandrababu Naidu
Political Violence
Guntur
AP Government

More Telugu News