Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు నమోదు... అరెస్ట్ చేసే అవకాశం!

Ambati Rambabu Case Filed Arrest Likely
  • సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటి రాంబాబుపై కేసు
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో చర్యలు
  • గుంటూరులోని అంబటి నివాసంపై టీడీపీ కార్యకర్తల దాడి
  • ఇంటి అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసం
  • అంబటి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

సీఎంపై అంబటి రాంబాబు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిళ్లి మాణిక్యల రావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి అంబటిపై కేసు నమోదు చేశారు.

ఈ పరిణామం నేపథ్యంలో గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు ఆగ్రహంతో ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కిటికీ అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా, ఈ రాత్రికి అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అప్పటికే ఆయన నివాసం వద్దకు 'వజ్ర' వాహనాన్ని తరలించారు. 
Ambati Rambabu
Chandrababu Naidu
YSRCP
TDP
Andhra Pradesh Politics
Guntur
Nallapadu Police Station
Arrest
Political Controversy
Pilli Manikya Rao

More Telugu News