Ambati Rambabu: అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు... చేతులు జోడించి క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

Ambati Rambabus House Attacked by TDP Activists Demanding Apology
  • ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల కలకలం
  • అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించిన టీడీపీ శ్రేణులు
  • చేతులు జోడించి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్
  • అంబటి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్ల దాడి.. కారు ధ్వంసం
  • ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ మహిళా కార్యకర్తల ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి బహిరంగంగా, రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఆమె నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి నివాసాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆగ్రహంతో ఉన్న కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వగా, మరికొందరు ఇంటి బయటన ఉన్న కారును ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడుల్లో ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు పగిలిపోయాయి. టీడీపీ మహిళా కార్యకర్తలు చీపురు కట్టలతో నిరసన తెలుపుతూ, అంబటి నివాసంపై కోడిగుడ్లు విసిరారు.ః

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంతటి అసభ్యకరంగా దూషించడం హేయమైన చర్య. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రజలందరి ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

మహిళా కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "చంద్రబాబు మాకు దైవంతో సమానం. గతంలో ఆయన కుటుంబసభ్యులను దూషించినప్పుడు సంయమనం పాటించాం. కానీ ఈసారి సహించేది లేదు. అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే మాకు అప్పగించాలి" అంటూ వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో అంబటి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Ambati Rambabu
Galla Madhavi
Chandrababu Naidu
TDP
YCP
Andhra Pradesh Politics
Guntur
Protest
Political Controversy
Apology

More Telugu News