NTR: పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే: గొట్టిపాటి రవికుమార్

NTR Gave Equal Rights to Women Says Gottipati Ravikumar
  • అవినీతి మూలాల నుంచి వైసీపీ పుట్టిందన్న గొట్టిపాటి
  • తెలుగు జాతికి గౌరవం తెచ్చింది ఎన్టీఆర్ అని వ్యాఖ్య
  • తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీ అవినీతి మూలాల నుంచి పుట్టిందని ఆయన అన్నారు. భీమవరంలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  

అనంతరం గొట్టిపాటి మాట్లాడుతూ... తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆస్తిలో మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనదే అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు, నారా లోకేశ్ కొనసాగిస్తున్నారని అన్నారు. కానీ, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

తిరుమల కల్తీ నెయ్యి విషయంలో కూడా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి విమర్శించారు. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ కూడా జగన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.
NTR
Gottipati Ravikumar
Chandrababu Naidu
Andhra Pradesh Politics
YSRCP Corruption
Women Rights
Polavaram Project
Tirumala
Nara Lokesh

More Telugu News