Jayant Patil: అజిత్ పవార్ చివరి కోరిక అదే: జయంత్ పాటిల్

Jayant Patil Reveals Ajit Pawar Wanted NCP Reunion Before Death
  • రెండు ఎన్సీపీ వర్గాల విలీనం దాదాపు ఖరారైందని జయంత్ పాటిల్ వెల్లడి
  • ఇదే అజిత్ పవార్ చివరి కోరిక అని వ్యాఖ్య
  • ఫిబ్రవరి 12న విలీనాన్ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయం
  • ఈ విలీన చర్చలపై అజిత్ పవార్ వర్గం మౌనం
  • కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న సునేత్ర పవార్
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందిన నేపథ్యంలో ఎన్సీపీ(ఎస్పీ) సీనియర్ నేత జయంత్ పాటిల్ సంచలన విషయాలు వెల్లడించారు. శరద్ పవార్ రాజకీయంగా చురుగ్గా ఉండగానే పార్టీ చీలిక అనే మచ్చను తొలగించుకోవాలని అజిత్ పవార్ బలంగా ఆకాంక్షించారని, రెండు ఎన్సీపీ వర్గాల విలీనమే ఆయన చివరి కోరిక అని పాటిల్ తెలిపారు.

ఇప్పటికే బారామతిలో శరద్ పవార్ చెప్పిన విషయాలను ధృవీకరిస్తూ, విలీన ప్రక్రియ దాదాపు ఖరారైందని పాటిల్ వివరించారు. "జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 12న విలీనాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ నెల‌ 16న జరిగిన సమావేశంలో నిర్ణయించాం. ఈ ప్రణాళిక గురించి ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ వంటి నేతలకు అజిత్ పవార్ స్వయంగా సమాచారం ఇచ్చారు" అని పాటిల్ పేర్కొన్నారు.

గత నాలుగు నెలల్లో విలీనంపై దాదాపు 10 ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయని, వీటిలో నాలుగు తన నివాసంలోనే జరిగాయని పాటిల్ వెల్లడించారు. ఈ సమావేశాల్లో కుటుంబాన్ని, పార్టీ కేడర్‌ను తిరిగి ఏకం చేయాలనే బలమైన కోరికను అజిత్ పవార్ వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. విలీనానికి ముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 'గడియారం' గుర్తుపై ఉమ్మడిగా పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, జయంత్ పాటిల్ ఈ విషయాలు వెల్లడిస్తుండగా, అజిత్ పవార్ వర్గం మాత్రం మౌనం పాటిస్తోంది. ఆ వర్గం నేతలు సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ విలీన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం తమ నాయకత్వంలో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇవాళ‌ కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

"అజిత్ దాదా చివరి కోరిక నెరవేరాలంటే, ఎమ్మెల్యేల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సునేత్ర పవార్ నిర్ణయం తీసుకోవాలి" అని పాటిల్ అభిప్రాయపడ్డారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదం మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Jayant Patil
Ajit Pawar
Ajit Pawar death
NCP
Sharad Pawar
Maharashtra politics
NCP split
Sunetra Pawar
Maharashtra Deputy CM

More Telugu News