KCR: కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Reacts Strongly to SIT Notice to KCR in Phone Tapping Case
  • నందినగర్ లోని కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అతికించిన అధికారులు
  • అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్
  • పైశాచిక ఆనందం పొందారంటూ తీవ్ర వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసం ముందు గోడకు నోటీసులు అతికించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారు’ అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. సిట్ అధికారులకు కేసీఆర్ స్వయంగా తన చిరునామాను అందించారని కేటీఆర్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించడం పైశాచిక చర్యేనని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న ఇంటికే వెళ్లి విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.

ఈ నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా..లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్ష నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ పోలీసులను నిలదీశారు. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తామని.. ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కేటీఆర్ తెలిపారు.

అసలేం జరిగిందంటే..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలిసారి అందించిన నోటీసులకు కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అధికారులు.. రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా నోటీసులు అందించేందుకు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అతికించి వెళ్లారు.
KCR
KCR phone tapping case
KTR
Telangana SIT
Revanth Reddy
BRS party
Telangana politics
Phone tapping case investigation
Nandinagar
Telangana CM

More Telugu News