Nirmala Sitharaman: బడ్జెట్ కోసం ప్రత్యేక ట్రేడింగ్.. ఆదివారం కూడా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు

Nirmala Sitharaman Stock Markets To Trade On Sunday For Budget
  • కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రేపు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
  • ఆదివారం అయినప్పటికీ యథాతథంగా కొనసాగనున్న మార్కెట్లు
  • ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
  • సెటిల్‌మెంట్ హాలిడే కావడంతో షేర్ల క్రయవిక్రయాలపై నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపు (ఫిబ్రవరి 1) ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లలో పూర్తిస్థాయి ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునేందుకు వీలు కలుగుతుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు యథావిధిగా ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పనిచేస్తాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్ ఇది.

అయితే, ఫిబ్రవరి 1న సెటిల్‌మెంట్ హాలిడే కావడంతో ట్రేడింగ్‌పై కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. జనవరి 30న కొనుగోలు చేసిన షేర్లను బడ్జెట్ రోజున (ఫిబ్రవరి 1) అమ్మడానికి వీలుండదు. అలాగే బడ్జెట్ రోజున కొన్న స్టాక్స్‌ను మరుసటి రోజు విక్రయించడం సాధ్యం కాదు.

ప్రభుత్వ రుణ ప్రణాళిక, ద్రవ్య లోటు లక్ష్యాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1శాతం నుంచి 4.2శాతం మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్థిక సర్వే 2025-26ను ఇప్పటికే ఈ నెల‌ 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
Nirmala Sitharaman
Budget 2026-27
Stock Market
Indian Stock Exchange
NSE
BSE
Financial Budget
Fiscal Deficit
Stock Trading
Share Market

More Telugu News