Dhurandhar: నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్.. ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు

Dhurandhar Movie Faces Criticism After Netflix Release
  • ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 
  • నెట్ ఫ్లిక్స్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
  • దాదాపు 9 నుంచి 10 నిమిషాల కీలక సన్నివేశాలను తొలగించారని నెటిజన్ల ఆరోపణ
బ్లాక్ బస్టర్ అందుకున్న లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ధురంధర్ ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నాళ్లుగానో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో ధురంధర్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ధురంధర్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఓటీటీలోకి వచ్చిన వెంటనే సినిమాపై నెట్‌ఫ్లిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆడియన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. థియేటర్‌లో చూసిన ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా నిడివి తక్కువగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్ వెర్షన్ 3 గంటల 45 నిమిషాలు ఉండగా, ఓటీటీ వెర్షన్ కేవలం 3 గంటల 25 నిమిషాలకే పరిమితమైంది. దాదాపు 9 నుంచి 10 నిమిషాల కీలక సన్నివేశాలను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా స్ట్రీమింగ్ మొదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఫిర్యాదులు హోరెత్తాయి. 

ముఖ్యంగా సినిమాలోని కొన్ని కీలక డైలాగ్స్‌ను మ్యూట్ చేయడం, కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ-సర్టిఫికేట్ పొందిన సినిమాను ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్లీ సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్‌కట్ వెర్షన్ చూడాలనుకున్నామని, ఇలా మార్పులు చేయడం వల్ల సినిమా సహజత్వం పోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

పాకిస్థాన్‌‌లో భారత గూఢచారులు నిర్వహించే ఆపరేషన్లు, భారత్‌పై దాడులకు సంబంధించి అక్కడి మాఫియా, ఐఎస్ఐ, రాజకీయ నాయకుల నెక్సస్‌ను సినిమాలో చూపించారు. ఐసీ -814 విమాన హైజాక్ ఘటన, 2001 పార్లమెంట్ దాడి, ముంబై ఉగ్రదాడులు వంటి కీలక సంఘటనలు కూడా మూవీలో  ఉన్నాయి. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఇక ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుండగా, అదే రోజు యష్ నటించిన 'టాక్సిక్' కూడా రిలీజ్ కానుండటం విశేషం.
Dhurandhar
Dhurandhar movie
Netflix
Ranveer Singh
Akshay Khanna
OTT release
movie review
Hindi movie
action thriller
box office

More Telugu News