Nari Nari Naduma Murari: నారీ నారీ నడుమ మురారి... ఓటీటీలోకి వస్తోంది... ఎప్పుడంటే...!

Nari Nari Naduma Murari Movie OTT Release on Amazon Prime
  • ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
  • తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి
  • సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్‌
సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ఓటీటీ విడుదలకు మూహూర్తం ఖరారైంది. ఈ మూవీ ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.  తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

జనవరి 14న సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా శర్వానంద్‌ నటన ఆకట్టుకోగా, హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల్లో మెప్పించారు. నరేశ్‌, సత్య, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తమదైన శైలిలో కామెడీతో అలరించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు. 

కథ విషయానికి వస్తే… బీటెక్‌ పూర్తి చేసి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న గౌతమ్‌ (శర్వానంద్‌) నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించిన గౌతమ్‌కు నిత్య తండ్రి రామలింగం (సంపత్‌ రాజ్‌) మొదట అడ్డుపడతాడు. ఆ తర్వాత ఒక షరతుతో పెళ్లికి అంగీకరిస్తాడు. అయితే పెళ్లి రిజిస్టర్‌ ఆఫీస్‌లో జరగాలని షరతు విధిస్తారు. తప్పనిసరి పరిస్థితిల్లో దీనికి అంగీకరించిన గౌతమ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత  ఓ అనుకోని చిక్కు ఎదురవుతుంది. 

గౌతమ్‌ కాలేజీ రోజుల్లో ప్రేమించిన దియా (సంయుక్త)తో ఉన్న అనుబంధం బయటపడుతుంది. ఈ రెండు ప్రేమకథలు ఎలా ముడిపడ్డాయి? వాటి ప్రభావం గౌతమ్‌ తండ్రి కార్తీక్‌ (నరేశ్‌), పిన్ని పల్లవి (సిరి హనుమంతు)ల దాంపత్య జీవితాన్ని విడాకుల దాకా ఎందుకు తీసుకెళ్లింది? అన్నదే మిగతా కథగా సాగుతుంది.
Nari Nari Naduma Murari
Sharwanand
Sakshi Vaidya
Samyuktha Menon
Ram Abbaraju
OTT Release
Amazon Prime Video
Telugu Movie
Comedy Entertainer
Sankranthi 2024

More Telugu News