Gujarat: చిరుత‌తో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు.. చివరకు అతనిపైనే కేసు!

Gujarat Man Kills Leopard with Sickle And Spear To Save Son
  • కొడుకు ప్రాణాల కోసం చిరుతపులితో పోరాడి చంపేసిన తండ్రి
  • గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఘటన
  • చిరుత దాడిలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
  • వన్యప్రాణిని చంపినందుకు వారిపై కేసు నమోదు చేసిన అటవీశాఖ
గుజరాత్‌లో ‘మనిషికి, వన్యప్రాణికి’ మధ్య జరిగిన ఓ నాటకీయ పోరాటంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు 60 ఏళ్ల వృద్ధుడు ఓ చిరుతపులితో పోరాడి, దాన్ని కొడవలి, ఈటెతో హతమార్చాడు. అయితే, ప్రాణ రక్షణ కోసం చేసిన ఈ పోరాటం వారిపై కేసు నమోదయ్యేలా చేసింది. ఈ ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా ప్రాంతంలో జరిగింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
బాబూభాయ్ నారన్‌భాయ్ వాజా (60) అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఉన్న షెడ్‌లో కూర్చుని ఉండగా, చీకటి మాటున ఓ చిరుతపులి అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసింది. తండ్రి కేకలు విన్న ఆయన కుమారుడు శార్దూల్ (27) గదిలో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. వెంటనే ఆ చిరుత బాబూభాయ్‌ను వదిలి శార్దూల్‌పై దాడికి దిగింది.

కొడుకు చిరుత పంజాలో చిక్కుకోవడంతో, బాబూభాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న ఈటె, కొడవలి తీసుకుని చిరుతపై ఎదురుదాడి చేసి చంపేశాడు. "రాత్రి నేను షెడ్‌లో ఉన్నప్పుడు చిరుత వచ్చింది. దాన్ని భయపెట్టడానికి కేకలు వేస్తే, అది నాపై దాడి చేసి గొంతు పట్టుకుంది. నా కొడుకు రాగానే చిరుత నన్ను వదిలి వాడిపై దాడి చేసింది. వాడిని కాపాడే ప్రయత్నంలో చివరకు కొడవలితో దాన్ని చంపేశాను" అని బాబూభాయ్ తెలిపారు.

ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని మొదట ఉనా ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, దాడికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం వన్యప్రాణిని చంపినందుకు బాబూభాయ్, శార్దూల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gujarat
Gir Somnath
Una
leopard attack
wildlife
Shardul
forest department
India
Babubhai Narambhai Vaja

More Telugu News