Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కార‌ణ‌మిదే!

Case Filed Against BRS MLA Padi Kaushik Reddy
  • కరీంనగర్ సీపీపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు
  • వీణవంక జాతరకు వెళ్తుండగా కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • హైకోర్టు ఆదేశాలను ప్రస్తావించడంతో పోలీసులతో వాగ్వాదం
  • జాతర ప్రాంగణం నుంచి కౌశిక్ రెడ్డిని బలవంతంగా తరలించిన పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనపై 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. గురువారం ఈ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉన్నందున, పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉంటుందని వారు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తనను అడ్డుకుంటే చూసుకుంటానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

అనంతరం పోలీసులు నాలుగు వాహనాలకు అనుమతించడంతో ఆయన జాతర వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా దళిత మహిళా సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టించాలని పట్టుబట్టడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా ఆయన వినకపోవడంతో బలవంతంగా జాతర ప్రాంగణం నుంచి బయటకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.
Padi Kaushik Reddy
BRS MLA
Kaushik Reddy
Karimnagar Police Commissioner
Veeravenka
Sammakka Saralamma Jatra
Telangana Politics
Police Case
Controversial Remarks
Political Controversy

More Telugu News