Vijay: మీకు 'బూస్ట్' ఇస్తాడన్న హీరో విజయ్ తండ్రి వ్యాఖ్యలకు తమిళనాడు కాంగ్రెస్ కౌంటర్

Congress Rejects Vijays Fathers Offer of Boost in Tamil Nadu
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం అందించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
  • మాకు రాహుల్ గాంధీ బూస్ట్, హార్లిక్స్ ఇస్తున్నారని, మరొకరు అవసరం లేదన్న కాంగ్రెస్
  • మా కేడర్‌‍ను చూస్తే ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థమవుతుందని వ్యాఖ్య
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం అందించడానికి తన కుమారుడు, టీవీకే అధినేత విజయ్ సిద్ధంగా ఉన్నారని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆఫర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మా పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తమకు బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా ఇస్తున్నారని, మరొకరు అవసరం లేదని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. టీవీకే, కాంగ్రెస్ కూటమి కోసం కసరత్తు జరుగుతోందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో, తిరువారూర్ జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరైన చంద్రశేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి విజయ్ 'బూస్ట్' ఇస్తారని అన్నారు. తమ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర, వారసత్వం ఉన్నాయని తెలిపారు.

అయితే తమకు విజయ్ బూస్ట్ అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై మాట్లాడుతూ, "మా కార్యకర్తలకు విజయ్ బూస్ట్ అవసరం లేదు. మా కేడర్‌ను చూస్తే వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తుంది. మాకు రాహుల్ గాంధీ ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంపై టీవీకే గానీ పార్టీ అధ్యక్షుడు విజయ్ కానీ స్పందించలేదు.

లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగనుందని భావిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అయితే తమకు ఈసారి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనితో టీవీకే, కాంగ్రెస్ పొత్తు వార్తలు వస్తున్నాయి. విజయ్‌తో పొత్తుకు సిద్ధమని అన్నాడీఎంకే, బీజేపీ బహిరంగ ప్రకటన చేశాయి. ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పొత్తుపై సంకేతాలు ఇచ్చారు. సిద్ధాంత పరంగా సహజ భాగస్వాములమని అన్నారు. విజయ్, రాహుల్ గాంధీ మధ్య మంచి స్నేహం ఉందని అన్నారు.
Vijay
Tamil Nadu politics
Congress
Rahul Gandhi
TVK
SA Chandrasekhar
alliance
Tamil Nadu assembly elections

More Telugu News