Vasamshetti Subhash: మగవారి అందాల గురించి మాట్లాడే జగన్ మాపై విమర్శలు చేయడమా?: మంత్రి వాసంశెట్టి సుభాష్

Vasamshetti Subhash criticizes Jagan over comments on male beauty
  • ఆడవేషంలో ఉన్న మగ కళాకారుడితో డాన్స్ చేస్తే జైల్లో పెడతారా అని జగన్‌పై మంత్రి సుభాష్ ఫైర్
  • చీకటి గది నుంచి బయటకొచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని జగన్‌కు హితవు
  • బడుగు వర్గాల నేతలను వాడు, వీడు అనడంపై తీవ్ర అభ్యంతరం
  • వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలు మరింత ఘనంగా చేసి చూపిస్తామని సవాల్
  • విజయసాయి రెడ్డి సలహా పాటిస్తే జగన్‌కే మంచిదని సూచన
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక కళాకారుడితో కలిసి తాను డాన్స్ చేస్తే జైల్లో వేస్తానని జగన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని, అసలు ఆయనకు ఆడ, మగ తేడా కూడా తెలియకపోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మగవారి అందాల గురించి మాట్లాడే జగన్, మంత్రులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎత్తిపొడిచారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సుభాష్, జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

శాంతి స్వరూప్ అనే కళాకారుడు ఆడవేషం ధరించిన పురుషుడనే కనీస విషయం కూడా జగన్‌కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంపై కనీసం వారి పార్టీలోని మాజీ మంత్రి రోజాను అడిగినా తెలిసిపోయేదని చురక అంటించారు. ఇంట్లో సెట్టింగులు వేసుకునే జగన్‌కు తమ జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పోలీసుల బట్టలిప్పి చూస్తానంటూ జగన్ చేసే విచిత్ర వ్యాఖ్యల అర్థం ఆయనకే తెలియాలని అన్నారు.

బడుగు, బలహీన వర్గాల నాయకులను 'వాడు', 'వీడు' అంటూ జగన్ అవమానించడం సరికాదన్నారు. తమ నాయకుడు సంస్కారం నేర్పారు కాబట్టే తాము జగన్‌ను వ్యక్తిగతంగా దూషించడం లేదని స్పష్టం చేశారు. సంక్రాంతికి, గణతంత్ర దినోత్సవానికి కనీసం జెండా ఎగరేయడానికి కూడా బయటకు రాని జగన్, వేడుకలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఏడాది కూడా తమ సంస్కృతిని చాటేలా ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.

జగన్ తన కోటలో ఉండే చీకటి గది నుంచి బయటకు వచ్చి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి సుభాష్ హితవు పలికారు. కోటరీని మార్చుకోమని విజయసాయి రెడ్డి ఇస్తున్న సలహాను పాటిస్తే జగన్‌కే మంచిదని సూచించారు.
Vasamshetti Subhash
Jagan
YS Jagan
Andhra Pradesh
AP Minister
Sankranti celebrations
Roja
Amaravati
YSRCP
Telugu News

More Telugu News