Kishan Reddy: మేడారంలో మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం

Kishan Reddy and Jual Oram Offer Prayers at Medaram Jatara
  • మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు
  • గద్దెలపై నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఓరం, కిషన్ రెడ్డి
  • గిరిజనుల మహా కుంభమేళా ఈ జాతర అని అభివర్ణించిన జువల్ ఓరం
  • రూ.890 కోట్లతో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను కేంద్ర మంత్రులు గురువారం సందర్శించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు.

గిరిజన డప్పు వాయిద్యాల మధ్య ఆలయంలోకి ప్రవేశించిన కేంద్ర మంత్రులు, గద్దెలపై 'నిలువెత్తు బంగారం' సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం జువల్ ఓరం మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క - సారలమ్మ జాతర గిరిజనుల మహా కుంభమేళా అని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, పీఎం జన్‍మన్ పథకం కింద రూ. 24,000 కోట్లు, తెలంగాణకు 23 ఏకలవ్య పాఠశాలలు కేటాయించినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ. 80 కోట్లు, రామప్ప ఆలయానికి రూ. 40 కోట్లు, జాతర ఏర్పాట్లకు ఈ ఏడాది రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మేడారంలో సమ్మక్క - సారలమ్మ పేరుతో రూ. 890 కోట్ల వ్యయంతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ప్రధాని ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.
Kishan Reddy
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Jual Oram
Tribal Festival
Telangana
Central Tribal University
PM Janman Scheme
Ponguleti Srinivas Reddy
Seethakka

More Telugu News