Ajit Pawar: ఆ ‘28 రోజులే’ అజిత్ పవార్ ప్రాణం తీశాయా?

Ajit Pawar Death Plane Missed Safety System by 28 Days
  • విమానాల్లో 'గగన్' వ్యవస్థను తప్పనిసరి చేసే నిబంధన
  • అది రాకముందే ఈ విమానం రిజిస్టర్ కావడం శాపమైందా?
  • కొత్త సేఫ్టీ రూల్స్ అమల్లోకి రావడానికి 28 రోజుల ముందే ఈ లేర్‌జెట్ రిజిస్ట్రేషన్ పూర్తి
  • క్లిష్టమైన వాతావరణంలో, చిన్న ఎయిర్‌పోర్టుల్లో ల్యాండింగ్‌కు ‘గగన్’ వ్యవస్థ అత్యంత కీలకం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాద దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కేవలం పైలట్ తప్పిదమో లేదా వాతావరణమో మాత్రమే కారణం కాదని, విమానంలో ఉండాల్సిన ఒక ఆధునిక భద్రతా వ్యవస్థ లేకపోవడం కూడా ప్రధాన కారణమై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదే భారత్ స్వదేశీ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ 'గగన్' (GPS Aided GEO Augmented Navigation).

ఆ 28 రోజుల కథేంటి?
భారత విమానయాన రంగంలో భద్రతను పెంచడానికి విమానాలన్నింటికీ 'గగన్' వ్యవస్థను అమర్చడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. అయితే, ఈ నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వచ్చిన తేదీకి కేవలం 28 రోజుల ముందే అజిత్ పవార్ ప్రయాణించిన 16 ఏళ్ల పాత లేర్‌జెట్ 45 విమానం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆ విమానానికి ఈ అత్యాధునిక శాటిలైట్ గైడెన్స్ సిస్టమ్ అమర్చడం నుంచి మినహాయింపు లభించింది. ఒకవేళ ఆ 28 రోజుల తర్వాత రిజిస్టర్ అయి ఉంటే చట్టప్రకారం అందులో 'గగన్' ఉండాల్సి వచ్చేది.

‘గగన్’ ఉంటే ప్రమాదం తప్పేదా?
బారామతి ఎయిర్‌పోర్ట్ వంటి చిన్న విమానాశ్రయాల్లో అత్యాధునిక 'ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్' (ILS) ఉండదు. ఇలాంటి చోట్ల తక్కువ విజిబిలిటీ ఉన్నప్పుడు విమానం రన్‌వేకు సరైన దిశలో, సరైన ఎత్తులో వస్తోందో లేదో ‘గగన్’ వ్యవస్థ పైలట్‌కు కచ్చితంగా చూపిస్తుంది.

  • నిన్నటి ప్రమాదంలో పైలట్లు రన్‌వేను సరిగ్గా గుర్తించలేక 'గో-అరౌండ్' (గాల్లో చక్కర్లు కొట్టడం) చేశారు.
  • రెండోసారి ప్రయత్నించినప్పుడు రన్‌వే అంచున విమానం కుప్పకూలింది.
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం, 'గగన్' వ్యవస్థ ఉండి ఉంటే.. పైలట్‌కు రన్‌వే పొజిషన్ గురించి 3D సమాచారం లభించేది, తద్వారా ఈ ఘోర ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేది.
కేవలం 28 రోజుల వ్యవధిలో ఒక కీలక భద్రతా నియమం నుంచి తప్పించుకున్న ఈ విమానం, చివరకు అదే సాంకేతికత లేక ప్రమాదానికి గురికావడం విషాదకరం. ప్రస్తుతం ఏఏఐబీ అధికారులు ఈ కోణంలోనే సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. 
Ajit Pawar
Ajit Pawar plane crash
Maharashtra Deputy CM
Gagan system
aircraft accident investigation
Baramati airport
instrument landing system
aviation safety
satellite navigation system

More Telugu News