Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు

Medamalli Balaji Recommended as AP High Court Judge
  • బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం 
  • కేంద్రానికి కొలిజియం సిఫార్సు
  • ఏపీ హైకోర్టులో 33 మందికి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీ నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం నిన్న సమావేశమై ఆయన పేరును ఆమోదించింది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. 

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నారు. కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, మెడమల్లి బాలాజీతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది.
 
మెడమల్లి బాలాజీ - నేపథ్యం 

కడప జిల్లా రాజంపేట మండలం శేషన్నగారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న బాలాజీ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సుబ్బయ్యనాయుడు సహకార సెంట్రల్‌ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. బాలాజీ పాఠశాల విద్యను రాజంపేటలో పూర్తి చేయగా, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. 1998 ఏప్రిల్‌ 9న బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. 

రాజ్యాంగ సంబంధ అంశాలు, సివిల్‌, క్రిమినల్‌, సర్వీస్‌, కమర్షియల్‌ కేసుల వాదనలో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2004 నుంచి 2006 వరకు అడ్వకేట్‌ జనరల్‌ కార్యాలయానికి అనుబంధంగా ఏజీపీగా సేవలు అందించారు. 2018-19 మధ్యకాలంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. అలాగే పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు, బ్యాంకులకు న్యాయ సలహాదారుగా కూడా సేవలందించారు.
Medamalli Balaji
AP High Court
Andhra Pradesh High Court
Supreme Court Collegium
Justice Surya Kant
Advocate General
Rajampet
Kadapa district
AP High Court Judges

More Telugu News