Madhu Yaskhi: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఆ మాట చెప్పి బ్లాక్‌మెయిల్ చేయవద్దు: మధుయాష్కీ

Madhu Yaskhi Says Congress MLAs Should Not Blackmail
  • దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్న మధుయాష్కీ
  • సీఎం, మంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని స్పష్టీకరణ
  • జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారేవారని వ్యాఖ్య
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు అభివృద్ధి కోసమే అంటూ బ్లాక్‌మెయిల్ చేయకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ హితవు పలికారు. దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందని అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసులు కార్యకర్తల్లా పని చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని మధుయాష్కీ అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశమయ్యారనేది అబద్ధపు ప్రచారం అన్నారు. ప్రతిరోజు వాళ్లంతా టచ్‌లోనే ఉంటారని అన్నారు

జగిత్యాలలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ల అంశంపై కూడా మధుయాష్కీ స్పందించారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారేవారని అన్నారు. అలాంటి సీనియర్ నాయకులు పదవుల కోసం కాదని, పార్టీ కోసం పని చేస్తారని వ్యాఖ్యానించారు. సింగరేణిలో అక్రమాలు జరిగాయన్న బీఆర్ఎస్ ఆరోపణలపై మధుయాష్కీ స్పందిస్తూ, అసలు బొగ్గే తవ్వలేదు అవినీతి ఎక్కడ జరుగుతుందని అన్నారు.
Madhu Yaskhi
Congress Party
BRS
Telangana Politics
Danam Nagender
Revanth Reddy
Telangana Police

More Telugu News