Gangster Nayeem: నయీం కేసులో కీలక పరిణామం.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

Gangster Nayeem Case ED Files Charge Sheet in Court
  • నయీం మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
  • విచారణకు స్వీకరించిన రంగారెడ్డి కోర్టు
  • మొత్తం 10 మందిపై అభియోగాలు.. రూ.11.30 కోట్ల ఆస్తుల గుర్తింపు
  • నయీం భార్య, కుటుంబ సభ్యుల పేర్ల ప్రస్తావన
  • నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఈడీ వినతి
ఏపీ, తెలంగాణ‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం-2002 కింద దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం, విచారణకు స్వీకరించింది.

ఈ కేసులో పాశం శ్రీనివాస్‌తో సహా మొత్తం 10 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. నయీం గ్యాంగ్ బెదిరింపులు, బలవంతపు రిజిస్ట్రేషన్ల ద్వారా సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను 'ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్'గా గుర్తించింది. ఈ ఆస్తులను నయీం తన భార్య హసీనా బేగం, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారించింది.

అనేకసార్లు నోటీసులు జారీ చేసినా నిందితులు విచారణకు హాజరుకాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) కూడా దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. విచారణకు రాని వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఈ 91 ఆస్తులను బినామీ చట్టం కింద ఐటీ శాఖ అటాచ్ చేసింది. తాజాగా ఈడీ కూడా వీటి జప్తునకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ కేసులో నయీంకు సహకరించిన కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ దృష్టి సారించింది. కోర్టు ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.
Gangster Nayeem
Nayeemuddin
Nayeem
Gangster Nayeem
Enforcement Directorate
ED
Money Laundering
Telangana
Andhra Pradesh
Pasam Srinivas
Crime Proceeds

More Telugu News