KTR: గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ మీద చెప్పే అబద్ధం అదే: కేటీఆర్

KTR Slams Congress Leaders for False Allegations Against KCR
  • కేసీఆర్ ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేశారని చెబుతున్నారని ఆగ్రహం
  • పార్లమెంటులో బీజేపీ ఎంపీ అప్పు గురించి అడిగితే రూ.3.5 లక్షల కోట్లు అని తేలిందని వెల్లడి
  • ఈరోజు ఓపిక లేని వ్యక్తి తెలంగాణను పాలిస్తున్నారని సీఎంపై ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందని అన్నారు.

కేసీఆర్ హయాంలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే నాటికి రూ.72 వేల కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు. అంటే కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పు రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఆ అప్పు తో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.

ఆరూరీ రమేశ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారని, కానీ 2023లో 16 వేల ఓట్లతో ఓడిపోయారని అన్నారు. కానీ ఈసారి భారీ మెజారిటీతో వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే దయచేసి కొత్త, పాత అని చూడవద్దని, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఓపిక లేని, తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

నిత్యం కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప ఏదీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ రెండున్నర సంవత్సరాలలో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. అయినప్పటికీ అప్పులు ఎందుకయ్యాయని ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికలు మొదలు ప్రతి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చారనే విషయం ఆలోచించవద్దని, గులాబీ కండువా కప్పుకుని వస్తే కేసీఆర్‌గా భావించి ఓటు వేయాలని సూచించారు. కుటుంబం అన్నాక విభేదాలు ఉంటాయని, కానీ బీఫామ్ ఇచ్చాక అందరూ కలిసి పోవాలని అన్నారు. 'గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే' అని వ్యాఖ్యానించారు.
KTR
K Taraka Rama Rao
Telangana
BRS
Revanth Reddy
Congress
KCR
Telangana Politics
Aroori Ramesh

More Telugu News