Droupadi Murmu: వికసిత్ భారత్‌కు 2026 పునాది సంవత్సరం: రాష్ట్రపతి ముర్ము

President Droupadi Murmu calls 2026 a pivotal year for Viksit Bharat
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఈ నెల 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఢిల్లీలోని పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల‌ 29న (గురువారం) ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. గడిచిన ఏడాది వేగవంతమైన ప్రగతి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలిచిపోయిందన్నారు. 'వికసిత్ భారత్' నిర్మాణంలో 2026వ సంవత్సరం ఒక కీలకమైన పునాది సంవత్సరంగా నిలుస్తుందని ఆమె అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో భారత్ అన్ని ప్రధాన రంగాలలో తన పునాదులను పటిష్ఠం చేసుకుందని, భవిష్యత్ వృద్ధికి బలమైన మార్గాన్ని నిర్మించుకుందని పేర్కొన్నారు.

బంకించంద్ర ఛటర్జీ రచించిన 'వందేమాతరం' గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకలను ఆమె గుర్తుచేశారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్, బిర్సా ముండా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ప్రస్తావించారు. దేశం తన పూర్వీకుల సేవలను గౌరవించుకున్నప్పుడు, యువతరంలో స్ఫూర్తి రగులుతుందని, అది అభివృద్ధి చెందిన భారత్ దిశగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు. 

కాగా, సమావేశాలకు ముందు మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఓట్ల దొంగతనం ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణ, ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో తెలిపింది.
Droupadi Murmu
President Murmu
Viksit Bharat
Budget Session 2024
Nirmala Sitharaman
Indian Economy
Parliament
Vande Mataram
Rajnath Singh
All Party Meeting

More Telugu News