Pakistan Cricket Board: మొండిగా వ్యవహరిస్తే.. ఆత్మహత్యా సదృశమే: పీసీబీకి పాకిస్థాన్ మాజీలు, బోర్డు మాజీ సభ్యుల హితవు

Pakistan Cricket Board Warned by Former Players
  • బంగ్లాదేశ్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్
  • పాక్ క్రికెట్ భవిష్యత్తును పణంగా పెట్టొద్దన్న మాజీలు
  • ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకుని ఏం సాధిస్తారని ప్రశ్న

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఆడటానికి భద్రతా కారణాలను చూపుతూ, తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. దీంతో, ఆ దేశం టోర్నీ నుంచి వైదొలగింది. మరోవైపు, బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్థాన్ కూడా ఓవరాక్షన్ చేస్తోంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని అంటోంది, ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు, బోర్డు మాజీ సభ్యులు పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 


పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ బంగ్లాదేశ్‌కు మద్దతు తెలపాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. ఒకవేళ పాక్ మొండిగా అదే పని చేస్తే అది ఆత్మహత్యా సదృశమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 


వరల్డ్‌ కప్‌ ఆడేందుకు జట్టును కచ్చితంగా పంపాలని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ అన్నారు. "వరల్డ్‌ కప్‌ కు జట్టును పంపకుండా... ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకొని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఏం సాధిస్తుంది?" అని పీసీబీ మాజీ కార్యదర్శి ఆరిఫ్‌ అలీ అబ్బాసి ప్రశ్నించారు. "భారత్‌ నుంచి తమ మ్యాచ్‌లను తరలించాలనే బంగ్లాదేశ్ డిమాండ్‌కు పాకిస్థాన్ తప్ప మరే ఇతర క్రికెట్ బోర్డు మద్దతు ఇవ్వలేదని మనం గుర్తుంచుకోవాలి. ఐసీసీ సమావేశంలో బీసీబీకి ఎవరూ మద్దతు ఇవ్వలేదు" అని పీసీబీ మాజీ ఛైర్మన్‌ ఖలీద్‌ మహమూద్ అన్నారు. 


"పాకిస్థాన్‌కు ఈ వివాదంతో ఏం సంబంధం? పాక్‌ తన మ్యాచులన్నీ ఎలాగూ శ్రీలంకలోనే ఆడుతోంది కదా. ఒకవేళ పాక్‌ తన జట్టును వరల్డ్‌కప్‌ ఆడేందుకు పంపకుంటే.. అది పాక్‌ క్రికెట్‌కు చాలా నష్టాన్ని కలిగిస్తుంది" అని మాజీ హెడ్‌ కోచ్‌ మోహ్సిన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. పాక్ దిగ్గజం ఇంజమమ్ ఉల్ హక్ స్పందిస్తూ... పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌లో పోటీ పడాలని, మెగా టోర్నీలో పాల్గొనడం పాక్‌ క్రికెట్‌కు మంచిదని అన్నారు.
Pakistan Cricket Board
PCB
Bangladesh
ICC
World Cup
Mohammad Hafeez
Inzamam ul Haq
Cricket
Pakistan Cricket

More Telugu News