Hyderabad Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Hyderabad Road Accident Kills Two Engineering Students
  • హైదరాబాద్ మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
  • అతివేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు 
  • మరో ముగ్గురి పరిస్థితి విషమం
  • మృతులు వనపర్తి జిల్లా వాసులుగా గుర్తింపు
హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వనపర్తి జిల్లాకు చెందిన సాయి వరుణ్, నిఖిల్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన 8 మంది విద్యార్థులు కారులో ప్రయాణిస్తున్నారు. వీరి కారు మేడిపల్లి వద్ద మెట్రో పిల్లర్ నెంబర్ 97ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట్, రాకేశ్‌, యశ్వంత్‌లకు తీవ్ర గాయాలు కాగా, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
Hyderabad Accident
Sai Varun
Medipalli
Road accident
Engineering students
Car accident
Vanaparthi
Metro pillar
Telangana
Accident death

More Telugu News