Ilhan Omar: యూఎస్ ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై అటాక్.. సిరంజితో ద్రవం చల్లిన ఆగంతుకుడు

Ilhan Omar Attacked With Syringe at Minneapolis Town Hall
  • దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెదిరింపులకు భయపడనని స్పష్టం చేసిన ఇల్హాన్ ఒమర్
  • దాడికి ముందు ఆమెపై ట్రంప్ తీవ్ర విమర్శలు  
అమెరికాలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. సోమాలియా మూలాలున్న యూఎస్ చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌పై దాడి జరిగింది. మినియాపోలిస్‌లో ఆమె నిర్వహిస్తున్న టౌన్ హాల్ సమావేశంలో ఓ వ్యక్తి ఆమె ముఖంపై గుర్తుతెలియని ద్రవాన్ని సిరంజితో స్ప్రే చేశాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇల్హాన్ ఒమర్ వేదికపై ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి సిరంజితో ద్రవాన్ని స్ప్రే చేశాడు. అక్కడే ఉన్న మినియాపోలిస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, థర్డ్-డిగ్రీ అసాల్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ద్రవాన్ని పరీక్ష కోసం సేకరించారు.

ఇటీవల రాష్ట్రంలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టి అనే వ్యక్తి మరణించడంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాడికి కొన్ని క్షణాల ముందు, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ రాజీనామా చేయాలని ఇల్హాన్ ఒమర్ డిమాండ్ చేశారు.

దాడి జరిగిన వెంటనే ఇల్హాన్ ఒమర్ సోషల్ మీడియాలో స్పందించారు. "నేను బాగానే ఉన్నాను. నేను ఒక పోరాటయోధురాలిని. ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు భయపడి నా పనిని ఆపను. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు" అని ఆమె పేర్కొన్నారు. దాడి జరిగినప్పటికీ ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ఇటీవలి కాలంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇల్హాన్ ఒమర్‌ను లక్ష్యంగా చేసుకుని తరచూ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Ilhan Omar
US MP
Minneapolis
Somalia
Syringe attack
Political violence
Alex Pretty
Kristie Noem
Donald Trump

More Telugu News