Mana Shankara Varaprasad Garu: 'మన శంకర వరప్రసాద్' కేసు.. నిర్మాతలకు ఊరట ఇవ్వని హైకోర్టు డివిజన్ బెంచ్

Mana Shankara Varaprasad Garu Producers Face Setback in High Court
  • సినిమా నిర్మాతలకు డివిజన్ బెంచ్‌లో చుక్కెదురు
  • టికెట్ ధరల పెంపుపై 90 రోజుల నిబంధనలో జోక్యానికి నిరాకరణ
  • సింగిల్ జడ్జి వద్దే వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు సూచన
  • సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేసిన చిత్ర నిర్మాణ సంస్థ
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల వివాదంలో చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు 90 రోజుల ముందు ప్రభుత్వ అనుమతిని బహిర్గతం చేయాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేసింది.

ఈ అంశంపై సింగిల్ జడ్జి వద్ద విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని అంశాలను సింగిల్ బెంచ్ ముందే తేల్చుకోవాలని నిర్మాతలకు సూచించింది.

వివాదం నేపథ్యం ఇదే..

ఈ ఏడాది జనవరి 8న తెలంగాణ హోం శాఖ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది. సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఇలా ధరలు పెంచడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు పడూరి శ్రీనివాస్ రెడ్డి, దాచేపల్లి చంద్రబాబు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఏదైనా సినిమాకు టికెట్ ధర పెంచాలని ప్రభుత్వం భావిస్తే, ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, అభ్యంతరాలు ఉన్నవారు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ధరల పెంపునకు అనుమతించినందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి సి.వి. ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది. పెంచిన ధరల ద్వారా సుమారు రూ. 42 కోట్లు అక్రమంగా వసూలు చేశారని మరో పిటిషన్ దాఖలు కాగా, దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.
Mana Shankara Varaprasad Garu
Telangana High Court
movie ticket prices
Shine Screens India LLP
Justice NV Shravan Kumar
Justice Aparesh Kumar Singh
Justice GM Mohiuddin
Tollywood
movie release
public domain

More Telugu News