Komatireddy Venkat Reddy: నేను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy vows to shut down corporate schools if he becomes education minister
  • కొన్ని సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయన్న మంత్రి
  • లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని విమర్శ
  • నల్గొండలో రూ.8 కోట్లతో కుమారుడి పేరిట కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
  • విద్యాహక్కు చట్టాన్ని కార్పొరేట్ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణ 
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్పొరేట్ విద్యాసంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ సంస్థలను మూసివేసి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా ఆదేశాలు జారీ చేస్తానని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తన కుమారుడు దివంగత ప్రతీక్‌రెడ్డి పేరిట నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేదలకు 25 శాతం సీట్లు కేటాయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎల్‌కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు వసూలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రాబల్యం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారని గుర్తుచేశారు.

అంతకుముందు, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. బొట్టుగూడ ప్రాంతంలోని ఈ పాఠశాలను 40 ఏసీ తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ వంటి సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Komatireddy Venkat Reddy
Telangana education
corporate schools
government schools
Young India Residential Schools
Nalgonda
education system
school fees
Prateek Reddy
Revanth Reddy

More Telugu News