Shilpa Shetty: శిల్పా శెట్టి రెస్టారెంట్ లో ప్రారంభ ఆఫర్... పోటెత్తిన జనాలు!

Shilpa Shetty Restaurant Free Offer Causes Massive Crowd
  • శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్ 'అమ్మకాయి'లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్
  • రిపబ్లిక్ డే ఆఫర్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్న జనం
  • భారీ రద్దీతో చాలామందికి దక్కని టిఫిన్
  • సోషల్ మీడియాలో 'ఉచితాల సంస్కృతి'పై భిన్న స్పందనలు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సహ యజమానిగా ఉన్న కొత్త రెస్టారెంట్ 'అమ్మకాయి' వద్ద భారీ రద్దీ నెలకొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచితంగా టిఫిన్ అందిస్తామని ప్రకటించడంతో, ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ రెస్టారెంట్ ముందు ప్రజలు బారులు తీరారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, జనవరి 26న రిపబ్లిక్ డేను పురస్కరించుకుని, లాంచింగ్ ఆఫర్ ప్రకటించారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఉచితంగా దోసె, ఇడ్లీ వంటి దక్షిణ భారతీయ వంటకాలను అందిస్తామని తెలిపారు. అయితే, ఈ ఆఫర్ కోసం ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది క్యూలో నిలబడ్డారు. ఊహించని రద్దీ కారణంగా ఆఫర్ సమయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించినప్పటికీ, చాలా మంది నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, ఉచిత ఆఫర్ కోసం క్యూలో కొందరు ధనికులు కూడా నిల్చుని ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఉచిత ఆఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు దీనిని మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తూ, రిపబ్లిక్ డే నాడు ఆకలితో ఉన్నవారికి సహాయం చేశారని ప్రశంసించారు. అయితే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఉచిత ఆహారం కోసం ప్రజలు ఇలా గంటల తరబడి క్యూలలో నిలబడటాన్ని తప్పుబట్టారు. ఇది 'ఉచితాల సంస్కృతి'ని ప్రోత్సహించడమేనని అభిప్రాయపడ్డారు.

శిల్పా శెట్టి మరికొంతమంది భాగస్వాములతో కలిసి ఈ 'అమ్మకాయి' రెస్టారెంట్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఇది దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన ఆల్-డే డైనింగ్ రెస్టారెంట్. తాజా ప్రచార కార్యక్రమం రెస్టారెంట్‌కు విస్తృత ప్రచారం కల్పించినప్పటికీ, అదే సమయంలో ఆన్‌లైన్‌లో విమర్శలను కూడా మూటగట్టుకుంది.
Shilpa Shetty
Amma Kai restaurant
Mumbai restaurant offer
Republic Day offer
Free food offer
South Indian food
Bollywood actress
Restaurant launch
Viral video
Freebies culture

More Telugu News