Dharmapuri Arvind: నేను, రఘునందన్ రావు కలిశామంటే..!: ధర్మపురి అరవింద్

Dharmapuri Arvind Comments on Meeting Raghunandan Rao
  • తామిద్దరూ కలిస్తే బీఆర్ఎస్ గల్లంతవుతుందన్న నిజామాబాద్ ఎంపీ
  • బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ధర్మపురి అరవింద్
  • బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందనుకోవడం లేదన్న రఘునందన్ రావు
మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో తాను కలిస్తే బీఆర్ఎస్ గల్లంతవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, మెజారిటీ స్థానాలు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఏ పార్టీలోనైనా గ్రూపు రాజకీయాలు, విభేదాలు సహజమేనని ధర్మపురి అరవింద్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ గొడవలు, కాంగ్రెస్ పార్టీలో మంత్రుల కొట్లాటలను చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయని, అనంతరం అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌లను ఎప్పుడో రంగంలోకి దింపామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్‌లలో తమకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని తాము అనుకోవడం లేదని, గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Dharmapuri Arvind
Raghunandan Rao
BJP
BRS
Municipal Elections
Telangana Politics
Nizamabad

More Telugu News