KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కేటీఆర్

KTR Complains to Governor on Revanth Reddy Government
  • సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
  • కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టడంతో కాంగ్రెస్‌లో వణుకు ప్రారంభమైందన్న కేటీఆర్
  • సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈరోజు గవర్నర్‌ను కలిసి సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

సింగరేణిలో దోపిడీ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఆధారాలతో బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. కుంభకోణాన్ని బహిర్గతం చేశాక అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఫుట్‌బాల్ ఆటకు రూ.10 కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

సీఎం అంటే కోల్ మాఫియా నాయకుడిగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సింగరేణి టెండర్లలో పారదర్శకత లేదని అన్నారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి సృజన్ రెడ్డి ముఖ్యమంత్రికి బావమరిదేనా, కాదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

రేవంత్ రెడ్డి సోదరులకు ఇదివరకే దోచుకున్నది సరిపోక, హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కుంభకోణం, హిల్ట్ పాలసీ వంటి ప్రజాధానాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరామని అన్నారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Singareni Collieries
Coal Scam
Telangana Governor

More Telugu News