Telangana State Election Commission: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

Telangana Municipal Elections Schedule Released Polling on February 11
  • 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • తక్షణమే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్
  • రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
  • ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు.

ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. వచ్చే నెల 16వ తేదీన కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో 52 లక్షల 43 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఉంటే వివిధ కారణాలతో 116 మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం నుంచి ఓటింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. రూ.50 వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని తెలిపారు.
Telangana State Election Commission
Telangana municipal elections
municipal elections schedule

More Telugu News