Nara Lokesh: పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు: టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం

Nara Lokesh TDP is family government is for rent
  • రాష్ట్ర అభివృద్ధికి కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని సూచన
  • పార్టీ నేతలు అలక వీడి, ఐక్యంగా పనిచేయాలని పిలుపు
  • శిక్షణ తరగతుల్లో నిత్య విద్యార్థిలా వెనుక కూర్చుని పాఠాలు విన్న లోకేశ్
  • యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ అనేది సొంతిల్లు వంటిదని, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిదని అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి తగిన సమయం కేటాయించాలని లోకేశ్ సూచించారు. "పార్టీ మన సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది. చంద్రబాబు గారికి ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికి ఒకసారి పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తలను కలుస్తున్నారు, శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారు" అని గుర్తుచేశారు. 

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉందని, కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. కేంద్ర సహకారంతోనే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామని, అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం
పార్టీ నాయకులు చిన్న చిన్న అలకలు వీడి ఐక్యంగా పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు అలకల వల్ల మనమే నష్టపోతాం. ఏదైనా సమస్య ఉంటే పార్టీలోనే పోరాడాలి" అని హితవు పలికారు. కనీసం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగితేనే రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలమని పవన్ కల్యాణ్ కూడా చెప్పారని గుర్తుచేశారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు సహజమని, వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాలన్నారు. మన మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పదవిని బాధ్యతగా స్వీకరించాలి
వ్యక్తులు శాశ్వతం కాదని, తెలుగుదేశం పార్టీయే శాశ్వతమని లోకేశ్ స్పష్టం చేశారు. "ఒక వ్యవస్థ కింద మనం అందరం నడుచుకోవాలి. పదవిని బాధ్యతగా స్వీకరించాలి. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా" అని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, పార్టీ కార్యక్రమాలను 'మై టీడీపీ యాప్' ద్వారానే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నిరంతర ప్రక్రియ అని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం, ఆయన స్వయంగా శిక్షణ తరగతులకు హాజరై, వెనుక వరుసలో కూర్చుని ఒక నిత్య విద్యార్థిలా పాఠాలు వినడం అందరినీ ఆకట్టుకుంది.

స్వయంగా ఆహ్వానం పలికిన మంత్రి లోకేశ్
అంతకుముందు, వర్క్‌షాప్‌కు హాజరైన పార్లమెంట్ కమిటీ సభ్యులకు మంత్రి లోకేశ్ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. ఇదే సమయంలో, నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Chandrababu Naidu
Palla Srinivasa Rao
Yuvagalam Padayatra
Amaravati
Polavaram
Vizag Steel Plant

More Telugu News