MK Stalin: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..' అంటూ మోదీ విమర్శలకు స్టాలిన్ కౌంటర్

MK Stalin Counters Modis Criticism on Tamil Nadu Governance
  • బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే దేశంలోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయన్న స్టాలిన్
  • తమిళనాడులో మహిళలు క్షేమంగా లేరన్న ప్రధాని వ్యాఖ్యలను కొట్టిపారేసిన సీఎం
  • 'డబుల్ ఇంజిన్' వర్సెస్ 'డబ్బా ఇంజిన్' నినాదాలతో ముదిరిన మాటల యుద్ధం
తమిళనాడులో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీకు సమాచారం ఇచ్చే వారు తప్పుగా ఇస్తున్నట్టున్నారు" అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని ప్రధాని చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తమిళనాడు యువత మాదకద్రవ్యాల బారిన పడుతోందన్న ప్రధాని విమర్శపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. "భారతదేశంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రధానికి తెలియదా? గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పోర్టుల నుంచే టన్నుల కొద్దీ డ్రగ్స్ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. మీ రాష్ట్రాల్లో ఉన్న గేట్‌వేలను అడ్డుకోకుండా, మా రాష్ట్రంపై నెపం వేయడం సరికాదు" అని మండిపడ్డారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, కానీ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.

తమిళనాడులో మహిళలు భయం గుప్పెట్లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలకు స్టాలిన్ తన ఎక్స్‌ వేదికగా బదులిచ్చారు. మహిళల సంక్షేమం, భద్రత విషయంలో తమిళనాడు దేశంలోని అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఉందని గుర్తుచేశారు. జయలలిత పాలనను ప్రశంసిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించిన మోదీ తీరును తప్పుబడుతూ.. తాము మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన 'మహిళా ఉచిత బస్ పాస్', 'కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై' వంటి పథకాలను వివరించారు.

తమిళనాడు అభివృద్ధికి ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రధాని పిలుపునివ్వగా.. దానికి స్టాలిన్ 'డబ్బా ఇంజిన్' అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి డబుల్ ఇంజిన్ రాష్ట్రాల కంటే, అభివృద్ధిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని గణాంకాలను ప్రస్తావించారు. ఢిల్లీ అహంకారానికి తమిళనాడు తలవంచదని, 2026 ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
MK Stalin
Stalin
Tamil Nadu
Narendra Modi
DMK
Drugs mafia
Women safety
Tamil Nadu elections
Double engine sarkar
Kalaignar Magalir Urimai Togai

More Telugu News