Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌కు భారీ షాక్: పంజాబ్‌లో తల్లిదండ్రుల అరెస్ట్!

Goldy Brar Parents Arrested in Punjab Crackdown
  • స్వర్ణ దేవాలయం సమీపంలోని హోటల్‌లో తలదాచుకున్న గోల్డీ బ్రార్ తల్లిదండ్రులు
  • 2024లో ఓ విద్యాశాఖ ఉద్యోగిని రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించిన కేసులో అరెస్ట్
  • దోపిడీ సొమ్ముతోనే జీవిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
విదేశాల్లో ఉంటూ భారత్‌లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌కు పంజాబ్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న గోల్డీ బ్రార్ తండ్రి షంషేర్ సింగ్, తల్లి ప్రీత్‌పాల్ కౌర్‌లను సోమవారం (జనవరి 26) పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌లోని హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) సమీపంలోని ఒక హోటల్‌లో వీరు బస చేసినట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా ఉదేకరన్ గ్రామానికి చెందిన సత్నాం సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ అరెస్టులు జరిగాయి. 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో సత్నాం సింగ్‌కు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చాయి. తాము బంబీహా గ్యాంగ్ సభ్యులమని చెప్పుకుంటూ, రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే కుటుంబంతో సహా చంపేస్తామని నిందితులు బెదిరించారు. దీనిపై విచారణ చేపట్టిన ముక్త్సార్ ఎస్ఎస్పీ అభిమన్యు రాణా బృందం.. ఈ బెదిరింపుల వెనుక గోల్డీ బ్రార్ తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

గోల్డీ బ్రార్ గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉండి, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్నట్లు భావిస్తున్న గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, పంజాబ్‌లో ఉంటూ అతడి నేరాలకు సహకరిస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గోల్డీ బ్రార్ తల్లిదండ్రులకు ఎటువంటి చట్టబద్ధమైన ఆదాయ మార్గాలు లేవని, దోపిడీ ద్వారా వసూలు చేసిన సొమ్ముతోనే వారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను నేడు ముక్త్సార్ కోర్టులో హాజరుపరచనున్నారు. విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన తాజా ఆపరేషన్‌లో ఇది ఒక ప్రధాన ముందడుగుగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే 60 మంది విదేశీ గ్యాంగ్‌స్టర్లకు సంబంధించిన 1,200 మంది అనుచరులు, వారి కుటుంబ సభ్యుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.
Goldy Brar
Goldy Brar parents arrested
Punjab police
gangster Goldy Brar
Lawrence Bishnoi gang
Sidhu Moose Wala murder
extortion case
Muktsar court
Bambiha gang
Punjab government

More Telugu News