Green Card: 50,000 అదనపు గ్రీన్ కార్డులు... భారతీయులకు మాత్రం నిరాశే!

Why Extra Green Cards Wont Help Indian Immigrants
  • 75 దేశాలపై ఇమ్మిగ్రెంట్ వీసాల నిషేధంతో 50,000 అదనపు గ్రీన్ కార్డులు
  • ఫ్యామిలీ కోటాలో మిగిలిన వీసాలు ఎంప్లాయ్‌మెంట్ కోటాకు బదిలీ
  • అయితే 'పర్-కంట్రీ క్యాప్' కారణంగా భారతీయులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిన వైనం
  • దేశాలవారీ కోటా పరిమితులే భారతీయుల నిరీక్షణకు ప్రధాన అడ్డంకి
అమెరికా ఇటీవల 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడంతో 2027లో సుమారు 50,000 అదనపు ఉపాధి ఆధారిత (ఎంప్లాయ్‌మెంట్-బేస్డ్) గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిషేధం ఈ నెల‌ 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఫ్యామిలీ-బేస్డ్ కోటాలో మిగిలిపోయిన వీసాలు, మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయ్‌మెంట్ కేటగిరీకి బదిలీ అవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుంది.

ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఒక వీడియో పోస్టులో ఈ విషయాన్ని విశ్లేషించారు. కొవిడ్ మహమ్మారి సమయంలోనూ ఇదే తరహాలో ఫ్యామిలీ కోటా వీసాలు ఎంప్లాయ్‌మెంట్ కోటాకు బదిలీ అయ్యాయని, ఫలితంగా ప్రయారిటీ తేదీలు నాలుగు నుంచి ఐదేళ్లు ముందుకు జరిగాయని ఆమె గుర్తుచేశారు. నిషేధం విధించిన 75 దేశాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 67,000 ఫ్యామిలీ వీసాలు కేటాయించాల్సి ఉంది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ వరకు కొనసాగితే, దాదాపు 50,000 వీసాలు మిగిలిపోతాయని అంచనా. ఈ జాబితాలో ఉన్న పాకిస్థాన్ (15,000), బంగ్లాదేశ్ (8,000) వంటి దేశాల నుంచి ఎక్కువ వీసాలు మిగిలిపోయే అవకాశం ఉంది.

గ్రీన్ కార్డుల సంఖ్య పెరిగినా భారతీయులకు తప్పని ఎదురుచూపులు.. ఎందుకంటే?
అదనంగా గ్రీన్ కార్డులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, భారతీయులకు మాత్రం దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఏ దేశానికీ కూడా ఏటా మొత్తం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులలో 7శాతం కంటే ఎక్కువ కేటాయించరు. ఈ 'పర్-కంట్రీ క్యాప్' (దేశాలవారీ కోటా పరిమితి) నిబంధనే భారతీయులకు ప్రధాన అడ్డంకిగా మారింది.

అభినవ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అజయ్ శర్మ ప్రకారం గ్లోబల్ స్థాయిలో వీసాల లభ్యత పెరిగినంత మాత్రాన భారతీయుల ప్రయారిటీ తేదీలు వేగంగా ముందుకు కదలవు. భారతదేశం నుంచి గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అందువల్ల 50,000 అదనపు గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చినా, ఆ సంఖ్యను దేశాలవారీ కోటా పరిమితిని దాటి భారత్ పొందలేదు. ఫలితంగా భారతీయుల గ్రీన్ కార్డు నిరీక్షణ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Green Card
US Green Card
employment based green card
immigration
US immigration
H1B visa
Indian immigrants
per country cap
Ajay Sharma
Abhinav Immigration Services

More Telugu News