Nara Lokesh: కలిసికట్టుగా పనిచేస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Says Mangalagiri Can Be Ideal Constituency
  • ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ప్రారంభించిన మంత్రి
  • దేవుడు పెట్టే పరీక్షలను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ
  • కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధిద్దామన్న లోకేశ్
  • కష్టాల్లో ఉన్న తోటివారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్య
అందరూ ఐక్యంగా, కలిసికట్టుగా పనిచేస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవచ్చని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం నాడు మంగళగిరి పట్టణంలోని ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం (AELC) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన క్రీస్తు కరుణాలయం (లూథరన్ చర్చి) ప్రతిష్టా మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించడంతో పాటు, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. కానీ, ఆ పరీక్షలను జయించే శక్తిని కూడా ఆయనే మనకు ప్రసాదిస్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ మందిరాన్ని పునర్నిర్మించుకోవడం గొప్ప విషయం. కష్టాల్లో ఉన్న మన తోటివారిని ఆదుకోవడం, వారికి అండగా నిలవడం మనందరి బాధ్యత" అని ఉద్బోధించారు. 

ఏడాదిలోపే చర్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం నెరవేరిందని, పట్టుదలతో పనిచేసిన పునర్నిర్మాణ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. చేయి చేయి కలిపితే ఏదైనా సాధించవచ్చనడానికి ఈ నిర్మాణమే ఒక ఉదాహరణ అని కొనియాడారు. ఈ మందిర నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం దేవుడు తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే యువత, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. "పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా బాధాకరం. దేవుడు పెట్టే పరీక్షలను సంకల్ప బలంతో జయించాలి" అని ఆయన హితవు పలికారు. 

తన రాజకీయ జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ, "2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలయ్యాను. అయినా నేను భయపడలేదు. మరింత కసితో పనిచేసి ప్రజలకు దగ్గరయ్యాను. ఓటమిని ఒక పరీక్షగా స్వీకరించి ముందుకు సాగాను" అని గుర్తుచేశారు. కులాలు, మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ కష్టాలను ఎదుర్కొందామని, దేవుడి ఆశీస్సులతో మంగళగిరిని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి, ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ పి.యస్ జోసఫ్, రైట్.రెవరెండ్ డాక్టర్ ఎస్.జే బాబూరావు, రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్, రెవరెండ్ జే.ఏసురత్నం, సంఘ పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి అందరితో కలిసి ఫోటోలు దిగారు.
Nara Lokesh
Mangalagiri
आदर्श निर्वाचन क्षेत्र
AELC
Lutheran Church
Krishna Karunalayam
Church Inauguration
Andhra Pradesh
Padmasali Corporation
Politics

More Telugu News