Operation Sindoor: కర్తవ్యపథ్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఆపరేషన్ సిందూర్' శకటం.. పరేడ్‌లో ప్రదర్శించిన సైన్యం

Operation Sindoor tableau a special attraction at Kartavya Path
  • గణతంత్ర వేడుకల్లో ఆపరేషన్ సిందూర్ శకటం ప్రదర్శన
  • పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ జరిపిన మెగా ఆపరేషన్ అది
  • త్రివిధ దళాల సంయుక్త పోరాట పటిమకు ప్రతీకగా శకటం
  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో త్రివిధ దళాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్'ను ఈ శకటం ద్వారా ప్రదర్శించారు. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనల సంయుక్త పోరాట శక్తికి, ఐక్యతకు ఇది ప్రతీకగా నిలిచింది.

‘సంయుక్త పోరాటంతో విజయం’ అనే థీమ్‌తో ఈ శకటాన్ని రూపొందించారు. యుద్ధ సమయంలో ప్రణాళిక, సమన్వయంతో నిర్ణయాత్మక చర్యలు తీసుకునే భారత సంకల్పాన్ని ఇది చాటిచెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు, సముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టిన నౌకాదళం వేగవంతమైన విన్యాసాలు, సైన్యం సాగించిన భూతల దాడులను శకటంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

గతేడాది పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టారు. మే 7న తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యలో పాకిస్థాన్.. భారత నగరాలపై క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా, వాటిని భారత వాయు రక్షణ వ్యవస్థ సమర్థంగా నిర్వీర్యం చేసింది.

ఈ ఆపరేషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన పాకిస్థాన్, ఇక తట్టుకోలేక కాల్పుల విరమణ చేయాలని అభ్యర్థించింది. దీంతో మే 10న ఆపరేషన్ నిలిచిపోయింది. భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా, సాంకేతికతతో కూడిన శక్తిగా భారత రక్షణ దళాలు రూపాంతరం చెందుతున్నాయని ఈ శకటం స్పష్టం చేసింది.
Operation Sindoor
Indian Army
Republic Day Parade
Kartavya Path
Pakistan
Indian Navy
Indian Air Force
Joint Military Operation
Terrorist Attack
Pahalgam

More Telugu News